మంచు కురిసే వేళలో.. ఆకట్టుకుంటున్న యాదాద్రి ఆలయ రమణీయ దృశ్యాలు - మంచుదుప్పటిలో యాదాద్రి ఆలయం
Fog around Yadadri : మంచు కురిసే వేళలో.. తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధి దృశ్యాలు మదిని దోచేస్తున్నాయి. మంగళవారం ఉదయం ప్రధాన ఆలయంతో పాటు సప్త రాజ గోపురాలు, మాడవీధులు, కొండపైకి చేరుకునే ఘాట్ రోడ్లు, పరిసర ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. సుమారు 2గంటల పాటు యాదగిరిగుట్ట పట్టణమంతా మంచు దుప్పటితో అలుముకుపోయింది. మంచులోనే భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్న అనంతరం ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు.
పరిసర ప్రాంతాల్లో పచ్చటి ఆకులపై నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. కొండపైకి వెళ్లే భక్తులు దారి కనిపించక కాస్త ఇబ్బంది పడినా.. పొగమంచు దుప్పట్లో కనువిందు చేసే యాదాద్రి ఆలయ దృశ్యాలను భక్తులు, ప్రకృతి ప్రేమికులు తమ చరవాణీలలో బంధించారు. మరికొందరు మంచులో దాక్కున్న యాదాద్రి ఆలయ అద్భుతాలను ఫొటోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రధాన రహదారిపై అటుగా వెళ్లే ప్రయాణికులను యాదాద్రి మంచు దుప్పటి దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.