జీ20 సదస్సు కోసం తెచ్చిన పూల మొక్కలు చోరీ.. లగ్జరీ కారులో వచ్చి మరీ.. - హరియాణాలో జీ20 సదస్సు మార్చి1 నుంచి 3 వరకు
హరియాణాలో పట్టపగలే పూల మొక్కల దొంగతనం జరిగింది. ఇద్దరు వ్యక్తులు లగ్జరీ కారులో వచ్చి మరీ మొక్కలను ఎత్తుకెళ్లారు. గురుగ్రామ్‌లో మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు జీ20 దేశాల సమావేశాలు జరగనున్నాయి. అందుకోసం జిల్లా యంత్రాంగం లక్షలాది మొక్కలు నాటి అక్కడి ప్రాంతాన్ని అందంగా అలంకరిస్తుంది. అందుకు తెచ్చిన కొన్ని మొక్కలను అధికారులు శంకర్ చౌక్‌లో ఉంచారు. అవి గమనించిన ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనను అక్కడే నిలబడిన ఓ వ్యక్తి తన మొబైల్‌లో వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్ అయింది. ఘటనా దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.