Delhi Floods Update Today
దిల్లీ 'ఎర్రకోట' చుట్టూ నీరే.. డ్రోన్ విజువల్స్ చూశారా? - దిల్లీ ఆస్పత్రిలో నీరు
Delhi Floods Update Today : దిల్లీలో వర్షాలు తగ్గుముఖం పట్టినా.. వరద ప్రవాహం మాత్రం తగ్గట్లేదు. మూడు రోజులుగా యమునా నది ఉగ్రరూపం చూపిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో ప్రవహిస్తూ.. రాజధాని ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మునుపటి రికార్డులను తిరగరాస్తూ.. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దిల్లీని వరదల్లో ముంచేసింది. చారిత్రక కట్టడం ఎర్రకోట చుట్టూ వరద నీరు చేరింది. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో నడుము లోతులో వరద నీరు ప్రవహిస్తోంది.
- Rains In Delhi : దిల్లీ.. మెట్‌కాఫ్ రోడ్‌లో ఉన్న సుశ్రుత ఆస్పత్రిలోకి వరద నీరు చేరింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న 40 మంది రోగులను స్థానిక ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్లు వైద్యులు సురేశ్ కుమార్ తెలిపారు.
- Delhi Trains : భారీ వర్షాల వల్ల వరద నీరు.. రైల్వే ట్రాక్‌లపై నిలిచిపోవడం వల్ల జులై 7 నుంచి జులై 15 వరకు 300కు పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 406 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
- Delhi Yamuna River : యమునా నది నీటి మట్టం పెరగడం వల్ల మూడు నీటి శుద్ధి కేంద్రాలను మూసివేసిన నేపథ్యంలో తాగునీటి సరఫరాను 25 శాతం తగ్గించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాజధాని వాసులకు నీటి కష్టాలు మొదలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి.
- Delhi Traffic : యమునా నది నీటిమట్టం రికార్డు స్థాయిలో పెరగడం వల్ల దిల్లీ రహదారులు నదులుగా మారాయి. ఇళ్లు, శ్మశానవాటికల్లోకి వరద నీరు చేరింది. దీంతో దేశ రాజధానిలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తూర్పు దిల్లీ ప్రాంతంలో గంటల తరబడి ప్రజలు ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు.
- Delhi Schools Closed : దిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలను ఆదివారం వరకు మూసివేయాలని దిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఆదేశించింది. నగరంలోని ప్రైవేట్ సంస్థలు ఇంటి నుంచే పని చేయాలని సూచించింది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.