Flexies Against Modi : రాష్ట్రంలో మోదీ పర్యటన.. మళ్లీ ప్రత్యక్షమైన ఫ్లెక్సీలు - మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
Flexies Against Modi Warangal Tour : ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్న ప్రతిసారీ బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానమంత్రి మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వెలవడం పరిపాటిగా మారింది. తాజాగా మేడ్చల్ జిల్లా పీర్జాధిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరంగల్ జాతీయ రహదారిపై పోస్టర్లు వెలిశాయి. 'కేంద్ర ప్రభుత్వం ఉప్పల్ నుంచి నారపల్లి వరకు వంతెనను ప్రారంభిస్తే.. ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి'. 'నేను వరంగల్.. నాది తెలంగాణ' పేరుతో దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విభజన హామీలు, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ మోదీజీ అంటూ ఆ ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు. కాగా ఆయన పర్యటనకు వ్యతిరేకంగా ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి పనులకు శంకుస్థాపనను వ్యతిరేకిస్తూ.. హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద జాతీయ రహదారిపై భూ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. పచ్చని తమ పంట పొలాల్లోంచి జాతీయ రహదారిని వెళ్లనివ్వమంటూ ధర్నా చేశారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిర్వాహితులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ పోరాటం జాతీయ రహదారి డిజైన్‌ను మార్చే వరకు ఆగదని భూ నిర్వాహితులు తేల్చి చెప్పారు.