Fishes died in Nalgonda : చెరువులో చేపలు మృతి.. అదే కారణమా..? - తెలంగాణ తాజా వార్తలు
Fishes died in Nalgonda : అక్కడి పరిశ్రమ ఆ ఊరి మత్స్యకారులకు శాపంగా మారింది. ఏటా లక్షల రూపాయలు వెచ్చించి.. గ్రామ పెద్దచెరువులో చేపలు పెంచుకుంటున్నారు. కానీ అక్కడి చెరువుకు సమీపంలో ఉన్న పరిశ్రమ నుంచి రసాయన వ్యర్థాలు చెరువులో కలవడంతో వేల సంఖ్యలో చేపలు చనిపోతున్నాయి. తాజాగా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు పెద్దచెరువులో సుమారు మూడు టన్నుల చేపలు మృతి చెందాయి. వెలిమినేడు పెద్దచెరువులో ఏటా మత్స్యకారుల సంఘం 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టి చెరువులో చేపల పెంపకం చేస్తున్నారు. కాగా భారీ మెుత్తంలో చేప పిల్లలు చనిపోయాయి.
చుట్టు పక్కన ఉన్న పరిశ్రమకు సంబంధించిన రసాయన పదార్థాలను చెరువులో కలవడం వల్ల చేపలు మృతి చెందినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో 5 లక్షల రూపాయల మేర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా తాము ప్రతి సంవత్సరం నష్టపోతున్నామని.. అధికారులు తక్షణమే స్పందించి కంపెనీపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు.