పోలీస్ సాహసం.. మూడు అంతస్తుల భవనంలో మంటలు.. తీరా పైకి వెళ్లాక..
ఉత్తర్ప్రదేశ్లో ఓ పోలీస్ అధికారి చేసిన పనికి అందరూ ప్రశంసలు కురుపిస్తున్నారు. ఇంతకీ ఆ పోలీస్ ఏం చేశాడంటే?.. కాన్పూర్ నగరంలోని బాద్షాహినాకా ప్రాంతంలో ఉన్న ఓ మూడంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న బట్టలు, ఇతర వస్తువులు, సామాన్లు కాలి బూడిదయ్యాయి. మొదటి అంతస్తులో మొదలైన మంటలు క్రమంగా.. భవనం మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. మంటల్లో చిక్కుకున్న నలుగురు వ్యక్తులను సురక్షితంగా కాపాడారు. అయితే ఈ క్రమంలోనే మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న గుప్తా అనే వ్యక్తి కుటుంబం మంటల్లోనే చిక్కుకుపోయినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు.
దీంతో విధుల్లో ఉన్న పోలీస్ అధికారి అంకిత్ ఖాతానా తన ప్రాణాలకు తెగించి మంటలు ఆర్పడానికి ప్రయత్నించడంతో పాటు ఆ కుటుంబాన్ని కాపాడటానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అంకిత్ పక్కనే ఉన్న మరో భవనంపైకి ఎక్కి.. మంటలు వ్యాపించిన మూడో అంతస్తులోని ఇంటి కిటికీ అద్దాలను పగలగొట్టి.. లోపలికి వెళ్లాడు. అయితే అంకిత్ లోపలికి వెళ్లాక.. అక్కడ ఎవరూ లేరని గుర్తించారు. కానీ ఆ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ను బయటకు తీసి.. భారీ పేలుడు సంభవించకుండా చేశారు. అంకిత్ చేసిన ఈ సాహసాన్ని వీడియో తీసిన కొందరు సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు, ప్రత్యేక్షంగా అంకిత్ సాహసాన్ని చూసిన స్థానికులు, అధికారులు.. అతడి ధైర్యానికి మెచ్చి ప్రశంసిస్తున్నారు.