మైలార్ దేవ్పల్లిలో భారీ అగ్నిప్రమాదం - తప్పిన ప్రాణ నష్టం - Fire Accident latest News in rangareddy
Published : Dec 11, 2023, 10:46 AM IST
Fire Accident In Rangareddy : రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టాటా నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోదామ్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతం మొత్తం విస్తరించింది. మంటలతో పాటు పొగ వ్యాపించడంతో కాలనీ వాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. స్థానికులు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసి వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. నాలుగు గంటలు శ్రమించిన అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
Fire Accident In Mailardevpally : కంపెనీ యజమాన్యం నిబంధనలకు విరుద్దంగా పరిశ్రమను నడుపుతోందని అధికారులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని వెల్లడించారు. ఎవరికీ హాని జరగకపోవడంతో స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లుగా కంపెనీ యాజమాన్యం తెలిపింది.