200 దుకాణాలు దగ్ధం.. రూ.50 కోట్లు నష్టం.. జీవనాధారం కోల్పోయామని వ్యాపారుల ఆవేదన - fire accident in KEONJHAR market
ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెంధూఝర్ పట్టణంలోని ఓ మార్కెట్లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 దుకాణాల వరకు దగ్ధం అయ్యాయి. సోమవారం జరిగిన ఈ ఘటనలో వ్యాపారులు రూ. కోట్లు నష్టపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. వాటర్ సప్లై లేని కారణంగా మంటలను ఆర్పడం ఫైర్ సిబ్బందికి కష్టతరమైంది. అయితే, ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా? ఎవరికైనా గాయాలు అయ్యాయా? అనే విషయాల గురించి సమాచారం బయటకు రాలేదు.
ఈ ప్రమాదంపై కెంధూఝర్ జిల్లా సబ్ కలెక్టర్ రామచంద్ర కిస్కు స్పందించారు. మంటలు చెలరేగడానికి కారణం ఇంతవరకు తెలియలేదని చెప్పారు. అయితే, షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు చెప్పారు. మంటలు చెలరేగడం వల్ల దాదాపు రూ.50 కోట్లకు పైగా ఆస్తి దగ్ధం అయినట్లు పేర్కొన్నారు. వ్యాపారులు వారి జీవనాధారమైన దుకాణాలను కోల్పోయారని రామచంద్ర కిస్కు అన్నారు.