Falaknuma Express Accident Update : 'ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. బయటపడ్డాం' - Falaknuma accident victims fires railway officials
Fire Accident in Falaknuma Express :యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 6 బోగీలకు మంటలు వ్యాపించగా.. 5 బోగీలు పూర్తిగా, ఒక బోగీ పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. కొంతమంది తమ వస్తువులు, విలువైన పత్రాలు పోగొట్టుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకన్న అధికారులు.. కాలిపోయిన బోగీలను రైలు నుంచి వేరు చేసి.. మిగిలిన బోగీలతో ట్రైన్‌ను సికింద్రాబాద్‌కు తీసుకొచ్చారు. మరోవైపు ప్రత్యేక బస్సుల్లో ఘటనా స్థలం నుంచి ప్రయాణికులను సికింద్రాబాద్‌కు తరలించారు.
ఇదిలా ఉండగా.. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన వస్తువులు, కీలక పత్రాల వంటివి కోల్పోయామన్నారు. అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఆరోపించారు. ఒడిశా ప్రమాదం తర్వాత కూడా భద్రత చర్యలు లేవని బాధితులు వాపోయారు. ప్రమాదంలో బ్యాగులు, నగదు కాలిపోయాయని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశామని ఆందోళన వ్యక్తం చేశారు.