Fire accident in Karimnagar : ఈతవనంలో అగ్నిప్రమాదం.. గీత కార్మికుల ఆవేదన - Massive Fire at karimnagar
Fire accident in Karimnagar : కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుమారు 400కు పైగా తాటి, ఈత చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారుగా 350 ఈత చెట్లు, 50 తాటి చెట్లు దగ్ధం అయ్యాయని కల్లు గీత కార్మికులు తెలిపారు. ప్రమాద సమయంలో స్థానిక రైతులు, గీత కార్మికులు హుస్నాబాద్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
గీతా కార్మిక సహకార సంఘం ఆధ్వర్యంలో తాటి, ఈత చెట్లు నాటి, పెంచి పోషించి వాటి ద్వారానే జీవనోపాధిని పొందుతున్నామని గీత కార్మికులు చెప్పారు. బాటసారులు తాగి పడేసిన సిగరెట్, బీడి అగ్గి రవ్వల వలన ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. వేసవికాలం కావడంతో పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం జరిగి తమకు తీవ్ర నష్టం ఏర్పడిందన్నారు. తమలో కొందరు జీవనోపాధి కోల్పోయామని, ప్రభుత్వం స్పందించి తగిన సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన చిగురుమామిడి తహశీల్దార్ జినుకా జయంత్ జరిగిన నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఉపాధి కోల్పోయిన గీత కార్మికులకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.