Fire Accident at TVS Showroom in Vijayawada: విజయవాడలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన టీవీఎస్ షోరూమ్..సుమారు 300 వాహనాలు దగ్ధం.. - kasa tvs showroom in vijayawada
Published : Aug 24, 2023, 10:31 AM IST
Fire Accident at TVS Showroom in Vijayawada: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున నగరంలోని కేపీ నగర్ ప్రాంతంలో ఉన్న కాసా టీవీఎస్ షోరూంలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. షోరూమ్‌తో పాటు గోదాములో ఉన్న సుమారు 300 వరకు ద్విచక్ర వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. విజయవాడలోని చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై స్టెల్లా కాలేజీ సమీపంలో ఈ బైక్ షోరూం ఉంది. నగరంతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన టీవీఎస్ వాహనాలకు ఇదే ప్రధాన కార్యాలయం కావడంతో వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడే గోదాముల్లో ఉంచుతారు. ద్విచక్ర వాహనాల షోరూంతో పాటు సర్వీస్ సెంటర్‌లను కూడా ఇదే ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో గోడౌన్, షోరూం, సర్వీస్ సెంటర్ కూడా ఉండటంతో వందల సంఖ్యలో వాహనాలు అక్కడ ఉంటాయి.
గురువారం తెల్లవారుజామున షోరూమ్‌లోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయి. కొద్ది సమయంలోనే మంటలు అటు గోదాముకూ విస్తరించాయి. వెంటనే భద్రతా సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నించాయి. ప్రీఫ్యాబ్రిక్ పద్ధతిలో నిర్మించిన షోరూమ్ కావడంతో మంటలు వేగంగా విస్తరించినట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. గోదాములో సాధారణ టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయని తెలిపారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పెట్రోల్ వాహనాలను ఉంచే గోదాము సమీపంలోనే పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలను కూడా పార్క్ చేసి ఉంచడం.. వాటిని ఛార్జింగ్ పెట్టడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో కొత్త వాహనాలతో పాటు సర్వీసింగ్ కోసం వచ్చిన వాహనాలు సైతం కాలి బూడిదయ్యాయి.