Fire Accident at RTC Bus in Korutla : డిపోలో ఆపిన బస్సులో మంటలు.. శుభ్రం చేస్తుండగా ప్రమాదం - రాజధాని ఎక్స్ప్రెస్కు అగ్నిప్రమాదం
Published : Oct 8, 2023, 5:19 PM IST
Bus Fire Accident at Korutla RTC Depo : జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ బస్డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ రాజధాని బస్సు సర్వీసులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అసలు అక్కడ ఏం జరిగిందో.. ఎవరికి అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి సమీపంలోనే డీజిల్ బంకు ఉండటంతో ఆర్టీసీ అధికారులు ఆందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ మంటలు వ్యాప్తించక ముందే ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది.
RTC Bus Catches Fire in Korutla : శంషాబాద్ నుంచి కోరుట్లకు అప్పుడే వచ్చిన రాజధాని ఎక్స్ప్రెస్.. ప్రయాణికులను దింపి డిపోలో నిలిపారు. ఈ క్రమంలో సిబ్బంది బస్సును శుభ్రం చేస్తుండగా అకస్మాత్తుగా మంటలు రేగాయి. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని.. మంటలను అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో భారీగా ప్రాణ నష్టం తప్పింది.