హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం.. ప్లైవుడ్ గోదాంలో చెలరేగిన మంటలు - రామంతపూర్‌లో అగ్నిప్రమాదం న్యూస్
Fire accident in Ramanthapur today : హైదరాబాద్‌లోని ఉప్పల్ పరిధిలో ఉన్న రామంతపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామంతపూర్‌లోని ఈజీ ప్లైవుడ్ గోదాంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో గోదాంలో మొత్తం సామగ్రి కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
నగరంలో తరచూ అగ్నిప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే బాగ్‌లింగంపల్లిలోని ఓ ఫర్నీచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామగ్రి మంటల్లో కాలి బూడిదయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన గోదాం పరిసర ప్రాంతాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.
హైదరాబాద్‌లో తరచూ అగ్ని ప్రమాదాలు జరగడంపై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. నగరంలో అగ్నిమాపక నియమాలు పాటించని భవనాలు వేల సంఖ్యలో ఉన్నాయని పేర్కొన్నారు. పురాతన గోదాములు, భవనాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చాలాఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన గోదాముల్లో జాగ్రత్తలు తీసుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై గోదాముల నిర్వాహకులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. తగిన ప్రమాణాలు పాటించకపోతే ఉపేక్షించేది లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.