Fire accident Secunderabad : సికింద్రాబాద్ లాడ్జిలో అగ్నిప్రమాదం - Fire accident at Secunderabad lodge
Fire accident at Secunderabad lodge : భాగ్యనగరంలో వరుస అగ్నిప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ప్రమాదాల మూలంగా తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న అశోక లాడ్జిలో అగ్నిప్రమాదం సంభవించింది. లాడ్జిలోని వంట గదిలో ఒక్కసారిగా.. పెద్ద ఎత్తున మంటలు చెలరెేగాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. ప్రమాద సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా వంటగదిలో చిమ్నీ మూలంగా జరిగిందో తెలియాల్సి ఉంది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. లాడ్జి యాజమానులు సరైన అగ్నిమాపక ప్రమాణాలు పాటించకపోవడం మూలంగానే ఘటన జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చనిపోయారు.