కోమటిరెడ్డిని కలిసిన టాలీవుడ్ పెద్దలు - సినీ పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ - Minister Komatireddy Guarantee on Cine Industry
Published : Dec 19, 2023, 4:50 PM IST
Film Producers Meet Minister Komatireddy Venkat Reddy :తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్‌రాజు ఆధ్వర్యంలో లోటస్ పాండ్‌లోని నివాసంలో కోమటిరెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. నిర్మాతలు సురేశ్‌బాబు, సుధాకర్ రెడ్డి, సి.కల్యాణ్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, దర్శకులు రాఘవేందర్ రావుతో పాటు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు కోమటిరెడ్డిని కలిసి అభినందించారు. కోమటిరెడ్డి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రితో చర్చించిన సినీ పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సినీ పరిశ్రమ తరఫున ఘన సన్మానం చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రికి వివరించారు. సినీ పరిశ్రమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిశ్రమ అభివృద్ధి కోసం తనవంతు కృషి చేయనున్నట్లు హామీ ఇచ్చారు.