Film Producer Nattikumar on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణం: సినీ నిర్మాత నట్టికుమార్ - Film Producer Nattikumar news
Published : Sep 12, 2023, 7:41 PM IST
Film Producer Nattikumar on Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అరెస్ట్, రిమాండ్‌పై తెలుగు సినీ పరిశ్రమ మౌనంగా ఉండటంపై ప్రముఖ నిర్మాత నట్టికుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులంతా మౌనం వీడి.. చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ఎంతో చేశారని, అలాంటి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు నైతికంగా మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత సినీ ప్రముఖులపై ఉందని ఆయన గుర్తు చేశారు.
Nattikumar Comments: నిర్మాత నట్టికుమార్ మీడియాతో మాట్లాడుతూ..''చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడం దారుణం. జూనియర్ ఎన్టీఆర్ సహా ఎవరూ మద్దతు ఇవ్వకపోడం నాకు బాధ కలిగించింది. సినీ పరిశ్రమ కోసం ముందుండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ వ్యక్తి ప్రస్తుతం కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండడం మానవత్వం. సినీ పరిశ్రమకు చంద్రబాబు ఎంతో సేవ చేశారు. చంద్రబాబుకు మద్దతిస్తే జగన్ ఏమైనా ఉరి తీస్తారా..? చంద్రబాబు సేవలను గౌరవించి అండగా నిలబడాలి. ఫిల్మ్ ఛాంబర్‌లోని నందమూరి ఫ్యాన్స్ ఎందుకు స్పందించట్లేదు. చిరంజీవి, రాజమౌళి, ప్రభాస్ లాంటివారు మద్దతుగా ట్వీట్ చేస్తే చాలు. చంద్రబాబుకు ముందుండి మద్దతు ఇచ్చిన హీరో పవన్ కల్యాణ్. పెద్ద కుమారుడుగా పవన్ ముందడుగు వేసి మద్దతు ఇచ్చారు. సినీ పరిశ్రమ పెద్దలు దొంగ ముసుగులు వేసుకోవద్దు. నేను తెలుగుదేశం పార్టీకి దూరం.. కానీ చంద్రబాబు నాయుడి వ్యక్తిత్వానికి దగ్గర. చంద్రబాబు లాంటి వ్యక్తి జైలులో కాదు.. ప్రజల్లో ఉండాలి. వైఎస్ జగన్ ప్రజలకు చాలా ప్రమాదం. చంద్రబాబు అంటే సినీ పరిశ్రమ.. సినీ పరిశ్రమ అంటే చంద్రబాబు. చంద్రబాబు భోళా శంకరుడు. చంద్రబాబు ఎప్పుడూ కక్షసాధింపులు చేయలేదు. చంద్రబాబు ఏనాడు వైఎస్‌ను కక్షపూరితంగా చూడలేదు. అల్లు అరవింద్, అశ్వినీదత్, సురేష్ బాబు, చిరంజీవి, ప్రభాస్, రాజమౌళిలాంటి సినీ ప్రముఖులంతా చంద్రబాబు చేసిన సేవలను గౌరవించి, అండగా నిలబడాలి'' అని నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు.