Film Producer KS Rama Rao Letter to PM Modi:కేంద్రానికి తెలియకుండానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందా..! ప్రధాని మోదీకి సినీ నిర్మాత కేఎస్ బహిరంగ లేఖ..
Published : Sep 17, 2023, 9:10 AM IST
|Updated : Sep 17, 2023, 11:12 AM IST
Film Producer KS Rama Rao Letter to PM Modi : కేంద్రానికి తెలియకుండానే జగన్ చంద్రబాబును అరెస్ట్ చేయించారా అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సీనియర్ సినీ నిర్మాత కేఎస్ రామారావు బహిరంగ లేఖ రాశారు. ఏపీలో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, కుంభకోణాలు, అక్రమ కేసులు, అభద్రతా భావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరఫున బాధతో, బాధ్యతతో అడుగుతున్నా అని లేఖలో ప్రస్తావించారు. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయిందిని లేఖలో పేర్కొన్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని.. కానీ, రాష్ట్ర పౌరుడిగా, భారతదేశ పౌరుడిగా ఏపీలో ప్రస్తుత పరిస్థితుల్ని చూసి బాగా విసిగిపోయానన్నారు. రాజధాని లేని రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక.. భావితరాల కోసం రాజధానిగా అమరావతిని ప్రకటించారని స్పష్టం చేశారు. శంకుస్థాపనకు మీరు కూడా వచ్చారని ప్రధాని మోదీని ఉద్దేశ్యిస్తూ గుర్తు చేశారు. కానీ జగన్ అధికారం చేపట్టిన వెంటనే.. విధ్వంసక పాలన మొదలుపెట్టారని లేఖలో వివరించారు. దేశంలో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు వల్లే ఇప్పుడు లక్షల మంది ఉద్యోగులు ప్రపంచవ్యాప్తంగా మంచి జీవితాలు అనుభవిస్తున్నారన్నారు. 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతను జైల్లో పెట్టి ఇబ్బందులు పెడుతుంటే తెలుగు ప్రజల హృదయాల్లో రగులుతున్న బడబాగ్ని గమనించాలని ప్రధాని మోదీని కోరారు. జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి.. రాష్ట్రపతి పాలన విధించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని లేఖలో పేర్కొన్నారు.