Green India Challenge : 'ప్రకృతి లయ తప్పడంతోనే ఈ అకాల వర్షాలు'
Narayanamurthy Green India Challenge : కాలాతీతంగా అకాల వర్షాలు కురవడానికి.. పర్యావరణం లయ తప్పడమే కారణమని పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రకృతిని విధ్వంసం చేయడమే ఇందుకు కారణమన్న ఆయన.. ప్రకృతిని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఎదిగిన చెట్లను నరకవద్దని హితవు పలికారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని జీహెచ్ఎంసీ పార్క్‌లో వేప మొక్కను నాటారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మొదలుపెట్టిన ఎంపీ జోగినపల్లి సంతోశ్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నారాయణమూర్తి.. దేశంలో జరిగిన వన సంరక్షణ ఉద్యమాలను గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారన్నారు. దక్కన్ పీఠభూమిలో అంతర్భాగమైన తెలంగాణ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణగా అవతరించిందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం వంటి పథకాలతో తెలంగాణ సస్యశ్యామలం అయిందన్నారు. తెలంగాణ నుంచి వలసలు పోయిన వారు.. నేడు తెలంగాణకు తిరిగొస్తున్నారని నారాయణమూర్తి హర్షం వ్యక్తం చేశారు.