Fight due to consumption of alcohol : సుక్క పడ్డ కిక్‌తో.. సినిమాల్లోగా ఫైటింగ్ - మహబూబాబాద్ జిల్లా వార్తలు
Fight due to consumption of alcohol in Mahabubabad : మహబూబాబాద్ జిల్లాలో మందు బాబులు రెచ్చి పోయారు. ఓ వైన్స్‌లో మద్యం సేవించిన మందు బాబులు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వీరి మధ్యన జరిగిన దాడులు సినిమాలోని సన్నివేశాలను తలపించాయి. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
ఓ వైన్స్‌షాప్‌లో పక్కనే ఉన్న సిట్టింగ్ రూములో కూర్చోని మద్యం తాగుతున్న క్రమంలో.. ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగిపోయింది. ఒకరిపై ఒకరు బెంచీలు కుర్చీలు విసిరేసుకున్నారు. అనంతరం ఒకరినొకరు కొట్టుకుంటూ షాపు బయటకు వచ్చారు.ప్రధాన రహదారిపై విచక్షణ మరిచి రాళ్లు విసురుకుంటూ దాడులు చేసుకున్నారు. వీరి ఘర్షణతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వీరి పరస్పర దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. మద్యం దుకాణం ఎదుట రెచ్చిపోయి కొట్టుకుంటున్న.. వీరిని స్థానికులు ప్రేక్షకుల మాదిరిగా చూస్తూ ఉండిపోయారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.