ఉద్రిక్త పరిస్థితికి ముగింపు - నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఫెన్సింగ్, బారికేడ్లు తొలగింపు - ఏపీ తెలంగాణ నాగార్జునసాగర్ డ్యాం వివాదం
Published : Dec 4, 2023, 7:32 AM IST
Fencing and Barricades Removed at Nagarjuna Sagar Dam: నాగార్జునసాగర్ డ్యాం వద్ద గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితికి ఎట్టకేలకు ముగింపు పడింది. గత నెల 29వ తేదీన సాగర్ డ్యామ్‌పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేసిన బారికేడ్లు, కంచెలను కేంద్ర బలగాలు తొలగించాయి. ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీటి వాటాను సక్రమంగా ఇవ్వడం లేదని ఆ రాష్ట్ర అధికారులు పోలీసు బలగాలతో డ్యాంపైకి ప్రవేశించి తెలంగాణ అధికారుల అనుమతి లేకుండానే కుడి కాల్వ ద్వారా నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం, కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (KRMB) స్పందించడంతో ఏపీ ప్రభుత్వం శనివారం రాత్రి నీటి విడుదలను నిలిపివేసింది.
ఆదివారం ఉదయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి పారుదల శాఖల అధికారులు చర్చించి, డ్యాంపై ఏర్పాటు చేసిన ముళ్ల కంచె, బారికేడ్లను తొలగించారు. డ్యాంకి ఇరువైపులా తెలంగాణ ఎస్పీఎఫ్ బలగాలను తొలగించాలన్న ఆంధ్రప్రదేశ షరతుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోవడంతో రెండు రాష్ట్రాల పోలీసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సాగర్ డ్యాం పర్యవేక్షణ తాత్కాలికంగా సీఆర్పీఎఫ్‌కు (Central Reserve Police Force) అప్పగించారు. సమస్య పరిష్కారానికి ఈ నెల 6వ తేదీన కృష్ణా రివర్ బోర్డుతో చర్చలు జరగనున్నాయి.