Viral Video: "జగన్ మామయ్య.. మా నాన్నను బాధ పెట్టకండి".. వీడియో వైరల్
Father and Daughter Request to Government: కూతురుతో కలిసి ఆడుకోవాల్సిన ఆ తండ్రి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తు కూర్చున్నాడు. దిగాలుగా ఉన్న తండ్రిని గమనించిన కూతురు ఎందుకు నాన్న అలా ఉన్నావంటూ అడిగింది. కూతురి మాటలకు ఆలోచనలో నుంచి బయటకు వచ్చిన తండ్రి.. తను బాధ పడటానికి గల కారణాన్ని చెప్పాడు. తండ్రి పడే వేదనను అర్థం చేసుకున్న ఆ పసి వయసు.. ముఖ్యమంత్రి జగన్‌కు విన్నపం చేసింది. 'జగన్ మావయ్య.. మా డాడీకి న్యాయం చేయండి' అని వేడుకుంది. కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని క్రమబద్ధీకరించపోవడంతో దిగాలుగా ఉన్న తండ్రిని కూతురు ఓదారుస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
2014 జూన్ 2 వరకు ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంటాక్ట్ లెక్చరర్స్‌ను రెగ్యులర్ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే నెలల తేడాతో ఉన్న వాళ్లకి ఈ విషయం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. నాలుగేళ్ల సర్వీసు దాటిన వారినీ క్రమబద్ధీకరించాలని ఈ వీడియోలో తండ్రికూతుళ్లు విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా బండిఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహబూబ్ బాషా కాంటాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ క్రమబద్ధీకరించాలని ఆయన, ఆయన కుమార్తె సహేలా తన విన్నపాన్ని వీడియో రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జగన్ మామయ్య మా నాన్నలాంటి ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ చిన్నారి సహేలా వేడుకోవడం పలువురిని హత్తుకుంది.