గంగానదిలో ఎద్దుల అస్తికలు నిమజ్జనం- బసవన్నలకు రైతన్నల ఘన నివాళి - మధ్యప్రదేశ్ రైతుల ఎద్దులు అస్తికలు గంగానదిలో
Published : Dec 25, 2023, 6:38 PM IST
Farmers Put Oxen Remains In Ganga River : ఎద్దుల పట్ల ప్రేమానురాగాలను అరుదైన రీతిలో చాటుకున్నారు ఇద్దరు రైతులు. రెండు వేర్వేరు సందర్భాల్లో మరణించిన 4 ఎద్దుల అస్తికలను శాస్త్రోక్తంగా గంగానదిలో నిమజ్జనం చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ కాస్గంజ్ జిల్లాలోని సోరోన్లో ఆదివారం జరిగింది. వీరిలో ఒకరు మధ్యప్రదేశ్ మందసౌర్ జిల్లాకు చెందిన రైతు భవానీ సింగ్.
"మానా, శ్యామా అనే రెండు ఎద్దులను నేను వ్యవసాయం ప్రారంభించినప్పటి నుంచి అంటే 30ఏళ్లుగా పెంచుతున్నాను. పొలం పనుల్లో ఇవి నాకు చాలా సాయంగా ఉండేవి. అందుకే ఇవి నాకు తండ్రితో సమానం. ఈనెల 16న అవి చనిపోతే తండ్రికి నిర్వహించినట్లే వాటికీ దహన సంస్కారాలు జరిపాను. తండ్రి అస్తికలకు ఎలా పూజలు చేస్తామో అలాగే వీటి అస్తికలకూ చేశాను. 11 రోజులకు వాటిని గంగానదిలో నిమజ్జనం చేశాను. ఇలా చేయడం మన కర్తవ్యం. ఈ రెండు ఎద్దులకు గుర్తుగా డిసెంబర్ 26న 3000 మందికి నా స్వగ్రామంలో అన్నదానం చేస్తున్నాను."
- భవానీ సింగ్, రైతు
మధ్యప్రదేశ్‌కు చెందిన మరో రైతు ఉల్ఫత్ సింగ్ కూడా చనిపోయిన తన రెండు ఎద్దులకు పిండప్రదానం చేశారు. 'రైతు ఉల్ఫత్ సింగ్‌కు చెందిన రెండు ఎద్దులు 8ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తు బండితో సహా బావిలో పడిపోయాయి. దీంతో అవి రెండూ మృతి చెందాయి. ఆయన(రైతు) ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి ఆయన వాటి అస్తికలను భద్రపరిచాడు. మంచి తిథి రోజైన ఆదివారం వీటిని గంగానదిలో కలిపేందుకు సోరోన్‌కు తీసుకువచ్చాడు. ఎలాగైతే తండ్రికి పిండప్రదానం చేస్తామో వీటికి అలానే చేశాడు. అస్తికలను నదిలో నిమజ్జనం చేశాడు' అని ఎద్దులకు సంబంధించి అస్తికల పూజా కార్యక్రమం నిర్వహించిన అర్చకుడు తెలిపారు.
టెన్త్, డిగ్రీ అర్హతతో ఎయిర్‌పోర్ట్‌లో 119 అసిస్టెంట్ జాబ్స్
వాజ్‌పేయీకి ప్రముఖుల ఘన నివాళులు- సేవలను గుర్తు చేసుకున్న మోదీ
స్నేహితురాలితో ట్రాన్స్‌జెండర్ లవ్! కాదనేసరికి కాళ్లు, చేతులు కట్టేసి సజీవ దహనం