Telangana Decade Celebrations: రైతు దినోత్సవ కార్యక్రమంలో సరదాగా ట్రాక్టర్ నడిపిన ఎమ్మెల్యే హరిప్రియ - mla haripriya drive tractor in farmers day program
Farmers Day in Telangana Decade Celebrations 2023 : రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు రైతు దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు పాల్గొని.. 9 ఏళ్లలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై ర్యాలీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రైతు దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే హరిప్రియ పాల్గొన్నారు. తలకు రుమాలు చుట్టి ట్రాక్టర్ నడుపుతూ పార్టీ శ్రేణులను, రైతుల్లో ఉత్సాహాన్ని కలిగించారు.
రైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో రైతుల పరిస్థితి క్లిష్టంగా ఉండేదని తెలిపారు. ఎందరో రైతులు బలవన్మరణాలకు పాల్పడేవారని పేర్కొన్నారు. రైతు చనిపోతే ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నాలు చేసే పరిస్థితులు ఉండేవని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఎకరాకు పదివేల చొప్పున పంట పెట్టుబడి సహాయం చేస్తుందని... ఒక్క ఇల్లందు నియోజకవర్గంలోనే ఇప్పటివరకు రైతులకు రైతుబంధు పథకం కింద 596 కోట్ల రూపాయలు నేరుగా జమ అవ్వడం జరిగిందన్నారు.