Crop Damage in Parakala : ఆరుగాలం పండించిన పంట వర్షార్పణం
Crop Damage in Parakala: రాష్ట్రంలో అకాల వర్షాలకు రైతులు అతలాకుతలమైపోతున్నారు. ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన పంట నీటి పాలవుతోందని వాపోతున్నారు. పంట చేతికొచ్చిన సమయానికి నీటిపాలవ్వడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఏడాదైనా పంట సరిగ్గా చేతికొస్తుందనుకుంటే.. నోటి కాడి బువ్వ లాక్కున్నట్లు వానొచ్చి.. తమ కష్టాన్ని ముంచేసిందని వాపోతున్నారు.
హనుమకొండ జిల్లాలోని పరకాల డివిజన్ వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. మామిడి, కూరగాయ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాత్రి బీభత్సమైన భారీ వర్షం జిల్లాను అతలాకుతలం చేసింది. ఇప్పటికే చీడలతో సగం పంట నష్టపోయిన రైతులకు.. ఇప్పుడు వర్షాలు మరింత నష్టాన్ని చేకూర్చాయి. ప్రభుత్వమే తమకు దిక్కని.. సర్కారే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. మరోవైపు జిల్లాలో ప్రజాప్రతినిధులు పంట పొలాలను పరిశీలించి రైతులకు భరోసా కల్పిస్తున్నారు.