Farmers Agitation at Khammam Collectorate : ఖమ్మం కలెక్టరేట్ వద్ద రైతులు, రైతుసంఘాల ఆందోళన.. మద్దతు తెలిపిన కాంగ్రెస్, వామపక్షాలు - తెలంగాణ న్యూస్
Farmers Agitation at Khammam Collectorate :ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. గ్రీన్‌ఫీల్డ్ హైవే అలైన్‌మెంట్ మార్చాలని నాగ్‌పుర్- అమరావతి హైవే భూనిర్వాసిత రైతులు ఆందోళన చేపట్టారు. పరిహారం కూడా పెంచాలని రైతులు, రైతుసంఘాలు (Farmers Protest at Khammam Collectorate) నిరసనకు దిగాయి. ఖమ్మం కలెక్టరేట్ ముట్టడికి రైతు సంఘాలు పిలుపునివ్వడంతో.. కాంగ్రెస్, వామపక్షాలు వారికి మద్దతు తెలిపాయి. కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు రైతులు, ఆందోళనకారులు యత్నించడంతో.. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోగా.. కలెక్టరేట్ ప్రధాన గేటు ఎదుట రైతులు బైఠాయించారు. బడా కాంట్రాక్టర్ల కోసమే రోడ్లు వేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (CPI Telangana Secretary Kunamneni Sambasiva Rao) అన్నారు. రైతులు వెనక్కి తగ్గకుండా పోరాటం కొనసాగించాలని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పోరాటమంటే రాష్ట్రమంతా ఉలిక్కి పడాలని.. ఇక్కడ దెబ్బేంటో రాష్ట్ర పాలకులకు, దేశ పాలకులకు రుచి చుపేట్టాలని ఆరోపించారు. ఇప్పుడు రైతులు ఖమ్మం పౌరుషాన్ని చుపేట్టాల్సిన అవసరం వచ్చిందని స్పష్టం చేశారు. రైతుకు ఇష్టం లేకుండా రైతు భూమిని లాక్కునే హక్కు పాలకులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. రైతులు గట్టిగా ఉంటే పోలీసులు కాదూ.. మీలట్రీ వాళ్లు వచ్చిన వారికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.