Farmer protest : కొప్పుల ఈశ్వర్ క్యాంప్ ఆఫీసు ముందు ధాన్యం పోసి రైతు నిరసన - Farmer protest in front of Minister Koppula house
Farmer protest in Koppula Eshwar Camp Office : జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన రాజన్న అనే రైతు మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంప్ ఆఫీస్ ముందు ధాన్యం పోసి నిరసన వ్యక్తం చేశాడు. 45 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాపోయారు. బస్తాకు నాలుగు కిలోలు తరుగు తీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంప్ ఆఫీసులో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఉండగానే ట్రాక్టర్‌లో తీసుకువచ్చి ఆఫీస్ ముందు ధాన్యం పోయడం చర్చనీయాంశంగా మారింది.
మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనుగోలు కేంద్రానికి వచ్చి.. తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని రాజన్న తెలిపారు. అయినా కొనుగోళ్లు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని చెప్పుకొంటుందని.. మరి అన్నదాతలను ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. మంత్రి క్యాంప్ ఆఫీసు దగ్గరకు చేరుకొని ధాన్యాన్ని ట్రాక్టర్లో అక్కడి నుంచి తీసివేయించారు. అనంతరం వాటిని పోలీస్ స్టేషన్కు తరలించారు.