మోటార్ లేకుండా పంట సాగు - ఎలా సాధ్యమైందబ్బా - తెలంగాణలో రైతు వినూత్న పంట సాగు
Published : Dec 8, 2023, 1:57 PM IST
Farmer Innovative Crop Cultivation in Mahabubabad :యాసంగి నారుమళ్లు దున్నాలంటే నీరు ఉండాలి. నీరును తోడేందుకు విద్యుత్ మోటారు ఉండాలి. ఇవి రెండూ ఉంటేనే రైతులు పంటలు సాగు చేసుకునేది. కానీ విద్యుత్ మోటారు లేకుండానే బావి నుంచి ఉబికి వస్తున్న నీటిని నారుమడికి అందిస్తున్నాడో రైతు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్లకు చెందిన రైతు గంధసిరి వేణుకు ఏనుకుంట చెరువు ఆయకట్టు పరిధిలో పొలం ఉంది.
ప్రస్తుతం యాసంగి సాగులో భాగంగా నారుమడి దున్నేందుకు రైతు తన వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లాడు. భూగర్భ జలాలు అమాంతంగా పెరిగి బావి నుంచి నీరు ఉబికి వస్తున్నాయి. చేతితో అందుకునేంత దగ్గరలో నీరు ఉబికి వస్తోంది. దీంతో రైతు ఎలాంటి విద్యుత్ మోటార్‌ను పెట్టకుండా బావి అంచు నుంచి నారుమడికి కాలువను ఏర్పాటు చేశాడు. బావి లోంచి వచ్చే నీటితో నారుమడి దున్ని నారు పోశాడు. ఉబికి వచ్చిన భూగర్భ జలాలతో నిండుకుండలా మారిన బావిని చూసి రహదారి వెంట వెళ్లేవారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.