థియేటర్లోనే టపాసులు పేల్చిన ఫ్యాన్స్- భయంతో ప్రేక్షకుల పరుగులు - థియేటర్లో టపాసులు పేల్చిన ఫ్యాన్స్
Published : Nov 13, 2023, 1:18 PM IST
Fans Burst Firecrackers Inside Theatre :బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్-3 సినిమా విడుదల సందర్భంగా మహారాష్ట్రలో కొందరు ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. మాలేగావ్‌లోని మోహన్ టాకీస్ హాల్ లోపలే భారీగా బాణాసంచా కాల్చారు. తారాజువ్వలను అంటించడం వల్ల థియేటర్ అంతా నిప్పు రవ్వలు ఎగిరిపడ్డాయి. దీంతో సినిమా హాల్‌లోని ప్రేక్షకులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు. కొందరు ముందు జాగ్రత్తగా హాల్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఫలితంగా తొక్కిసలాట జరిగే ప్రమాదం తలెత్తింది.
ఆదివారం సెకండ్ షో సమయంలో ఈ ఘటన జరగగా.. థియేటర్ అంతా దట్టమైన పొగతో నిండిపోయింది. అదృష్టవశాత్తు సినిమా హాల్‌లోని కుర్చీలు, పరదాకు మంటలు అంటుకోకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. దీనిపై స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వందల మంది ప్రాణాలను పణంగా పెట్టిన పోకిరీలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.