'దేశంలోని ప్రతి పర్యటక కేంద్రంలో రామోజీ ఫిల్మ్ సిటీ తరహా చిత్రనగరి' - కశ్మీర్లో జీ 20 2023 సమ్మిట్
భారత్‌లో పర్యటక రంగాన్ని మెరుగుపరిచేందుకు ఎన్నో కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు కేంద్ర పర్యటకశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరుగుతున్న జీ-20 సమావేశాల్లో మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. పర్యటక రంగ అభివృద్ధికి జమ్ముకశ్మీర్ ఉత్తమమైందని ఆయన అన్నారు. భారత్‌లోనే నంబర్ 1 ఫిల్మ్ సిటీ అయిన రామోజీ ఫిల్మ్‌సిటీ తెలంగాణలో ఉందన్న ఆయన ఫిల్మ్ సిటీలు జమ్ముకశ్మీర్‌తో సహా అన్ని పర్యటక ప్రదేశాల్లో ఉండాలని ఈటీవీ భారత్ ముఖాముఖిలో ఆకాంక్షించారు.
"భారత్‌లో పర్యటకాన్ని అభివృద్ధి చేసేందుకు, పర్యటకానికి భారత్‌ను తొలి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నాము. అందులో ఫిల్మ్ టూరిజం ఒకటి. చిత్ర పర్యాటకం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు శ్రీనగర్ అందులో ముఖ్యమైంది. ఈ జీ-20 సదస్సు ముఖ్య అజెండా పర్యటకమే." అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
శ్రీనగర్‌లో జీ-20 సదస్సు నిర్వహణపై పాకిస్థాన్ వైఖరిని కేంద్రమంత్రి తప్పుబట్టారు. పాక్ ముందు తన అంతర్గత విషయాలను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. భారత్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని దాయాదికి స్పష్టం చేశారు. భారత్‌లో తమ పనులు తాము చేసేందుకు ఏ ఉగ్రసంస్థ అనుమతి పొందాల్సిన అవసరం లేదని పాక్‌కు చురకలంటించారు.