Viral Video : నా చావుకు ఆ నలుగురే కారణమంటూ సెల్ఫీ వీడియో.. ఆపై - satya gowd selfi video in singarayapalli
EX Sarpanch Selfie Video Viral in Singampalli : తన చావుకు కారణం ఎవరు? ఎందుకు చనిపోతున్నాడు? తదితర విషయాలు చెప్పి.. సెల్ఫీ వీడియో తీసుకున్నాడు ఓ మాజీ సర్పంచ్. అయితే అతను ప్రస్తుతం అదృశ్యం అయ్యాడు. ఆ వీడియోను కుటుంబసభ్యులు చూసి ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఆ మాజీ సర్పంచ్ ఎవరు? అతడు ఎందుకు చనిపోవాలనుకున్నాడు? చివరకు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని సింగరాయిపల్లిలో మాజీ సర్పంచ్ సత్యగౌడ్ అదృశ్యం కలకలం సృష్టిస్తోంది. ఇతడు గ్రామ సర్పంచ్ భర్త అనుమానాస్పద కేసులో ఇదివరకే అరెస్టై.. బెయిల్ మీద బయటకు వచ్చాడు. గతంలో సర్పంచ్‌గా ఉన్నప్పుడు గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణం చేశాడు. దీనికి సంబంధించిన బిల్లుల కోసం ఎంపీవో చెక్కు ఇవ్వలేదని సెల్ఫీ వీడియోలో చెప్పాడు. చెక్కు తనకు రాకుండా గ్రామానికి చెందిన అధికం రాజేందర్ గౌడ్, తోట భూమయ్య, గొల్ల అంజయ్య, ఇసాయిపేట సర్పంచ్ బాలాగౌడ్ కలిసి చెక్కును అధికం నిఖిల్ గౌడ్ రాసుకున్నారని వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పటికే అప్పుల బాధ పడలేక అర ఎకరం భూమిని అమ్ముకున్నానని తెలిపాడు. ఈ డబ్బులు రాకుండా వారు అడ్డుకున్నందుకు మనోవేదనకు గురయ్యానని.. తన చావుకు ఆ నలుగురే కారణమని వీడియోలో చెప్పాడు. ఆదివారం నుంచి అతను కనిపించకపోయే సరికి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.