ఆతిథ్యం స్వీకరించాలంటూ ట్విటర్ వేదికగా ఆహ్వానం - అభిమాని ఇంటికెళ్లి భోజనం చేసిన కేటీఆర్ - kTR latest news
Published : Jan 8, 2024, 11:57 AM IST
EX Minister KTR Visit IbrahimHome In Borabanda :తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన అభిమాని ఇంటికి భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెళ్లారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్కు ట్విటర్ వేదికగా జనవరి రెండో తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తన ఇంటికి విచ్చేయాలని కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకు ఇంటికి వస్తానన్న కేటీఆర్, ఆదివారం ఇబ్రహీంఖాన్ ఇంటికి వెళ్లగా కుటుంబసమేతంగా ఇబ్రహీంఖాన్ స్వాగతం పలికారు.
KTR Visit Ibrahim Khan Home :అనంతరం వారితో ముచ్చటించిన కేటీఆర్, ఖాన్ కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేశారు. ఇబ్రహీం ఖాన్ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి, తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒక సాధారణ పౌరుడు తమ ప్రభుత్వ సేవలకు గుర్తింపుగా తన ఇంటికి ఆహ్వానించడం తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఇలాంటి సంఘటనలు మరింత నిబద్ధతతో ప్రజల కోసం కష్టపడేలా స్ఫూర్తి ఇస్తాయని పేర్కొన్నారు.