హెచ్‌సీఏ నిధుల కేసులో మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు ముందస్తు బెయిల్ - మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ముందస్తు బెయిల్ మంజూరు
Published : Nov 6, 2023, 7:38 PM IST
Ex Cricketer Azharuddin Anticipatory Bail : మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్‌కు మల్కాజ్‌గిరి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల్లో గోల్‌మాల్ చేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పీఎస్‌లో అజారుద్దీన్‌తో పాటు మరికొందరిపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ అజారుద్దీన్ మల్కాజ్‌గిరి కోర్టును ఆశ్రయించారు. ఉప్పల్ స్టేడియంలో జిమ్‌తో పాటు, బంతుల కొనుగోలు, కుర్చీల ఏర్పాటులో అక్రమాలకు పాల్పడ్డానంటూ నమోదైన కేసులో వాస్తవం లేదని.. అజారుద్దీన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పరిగణలోకి తీసుకున్న కోర్టు... అజారుద్దీన్‌కు 41 సీఆర్పీసీ నోటీసులిచ్చి ప్రశ్నించాలని ఉప్పల్ పోలీసులను కోర్టు ఆదేశించింది. రూ.25 వేలు, ఇద్దరీ పూచీకత్తులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అజారుద్దీన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో అజారుద్దీన్‌కు ఊరట లభించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరిస్తున్నారు. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో గెలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.