సిద్ధరామయ్యకు తప్పిన పెను ప్రమాదం.. కారులో కూర్చుంటూ ఒక్కసారిగా.. - కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధరామయ్య
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు పెను ప్రమాదం తప్పింది. కారులో నిల్చొని కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఒక్కసారిగా కింద పడబోయారు. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సహాయకుడు.. ఆయనను పట్టుకొని కారులో కూర్చొబెట్టారు.
అసలేం జరిగిందంటే?
విజయనగర జిల్లాలోని హోస్పెట్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధరామయ్య.. శనివారం ఉదయం బయలుదేరారు. కారు ఎక్కేందుకు తన నాయకులతో నడిచి వెళ్లారు. కారు ఎక్కిన అనంతరం అక్కడే ఉన్న కార్యకర్తలకు అభివాదం చేశారు. ఆ తర్వాత కారులో కూర్చొబోతూ కింద పడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సహాయకుడు.. ఆయనను పట్టుకున్నారు. అనంతరం కారులో కూర్చొబెట్టి మంచినీరు అందించారు.
సిద్దరామయ్య ట్వీట్..
ఈ విషయం తెలుసుకున్న సిద్ధరామయ్య అభిమానులు కాస్త ఆందోళన చెందారు. దీంతో తనకు ఏమి కాలేదని ఆయన ట్విట్టర్లో తెలిపారు. తన గురించి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. కారులో కూర్చొబోతుండగా కాలు జారిందని ఆయన చెప్పారు.
మే10న ఎన్నికలు..
కర్ణాటకలో 16వ అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలు అదే నెల 13న వెల్లడించనున్నారు. రాష్ట్రంలో మొత్తం 224 స్థానాలుండగా ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది.