రాష్ట్రంలో అకాల వర్షం... అపార నష్టం - ప్రతిధ్వని ప్రత్యేకచర్చ
Pratidwani: అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు నిలువునా ముంచేశాయి. ఆరుగాలం శ్రమించి... పండించిన పంటను అమ్ముకుందామనే ఆశతో ఎదురు చూసిన అన్నదాతను వడగళ్లు, ఈదురు గాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. ఒక్కసారిగా విరుచుకుపడ్డ వర్షాలు చేతికందాల్సిన పంటను నేలపాలు చేశాయి. అప్పటిదాక పంటను చూసుకొని మురిసిపోతూ ఇంటికెళ్లిన రైతులకు.. ఉప్పెనగా విరుచుకుపడ్డ వడగాళ్ల వాన కోలుకోకుండా చేసింది. రేపు మార్కెట్లో అమ్ముకుంటే అప్పులు తీరి ఆదాయం వస్తుందనుకుంటే.. కనీసం ఇంట్లోకి కూడా తీసుకుపోలేని పరిస్థితి ఎదురైంది. రాత్రికి రాత్రే వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, మిర్చి, మామిడి, బొప్పాయి, అరటి తోటలకు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఈ అకాలనష్టం నుంచి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతన్నలు వేడుకుంటున్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పర్యటించి పంటనష్టంపై అంచనాలు రూపొందించాలని వారు కోరుతున్నారు. ఈ అకాల వర్షంతో క్షేత్రస్థాయిలో ఎంత పంటనష్టం జరిగింది..? వడగళ్ల మిగిల్చిన కడగండ్లు గట్టెక్కాలంటే వారికి కావాల్సిన తక్షణ సాయం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.