Pratidwani : ప్రాణాలు తీస్తున్న గేమింగ్, బెట్టింగ్ యాప్‌లు - ఈటీవీ ప్రతిధ్వని
Pratidwani : బెట్టింగ్, గేమింగ్ యాప్‌లు ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. ఒకరో ఇద్దరో కాదు... పదుల సంఖ్యలో బాధితులు నమోదు అవుతున్నారు. క్రమం తప్పకుండా ఒకదాని వెంట మరో ఘటన వెలుగుచూస్తునే ఉంది. వేలు, లక్షల రూపాయలు పోగొట్టుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్న వారి దయనీయగాధలు మనసుల్ని కలుక్కుమనేలా చేస్తున్నాయి. సరాదాగా మొదలైన గేమింగ్ ఆటలు... తరువాత విద్యార్థులు, యువత, చివరకు ఇంట్లో ఉండే ఆడవారిని తమ ఉచ్చులోకి లాగేస్తున్నాయి. పగలు, రాత్రి లేకుండా ఆడుతూ... ఇంట్లో డబ్బులు, బయట అప్పులు చేసి ఆడి చివరకు మొత్తం పోగొట్టుకున్నాక.. పరువు పోయిందన్న భయంతో ఉరితాడుకు వేలాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి. అసలు ఈ ఉపద్రవానికి కారణం ఏమిటి? స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ పుణ్యమా అని... అరచేతిలోకి ప్రపంచం రావడం ఏమో గానీ... ఆ మాటున జరుగుతున్న మోసాలకు అన్యాయంగా బలి అయిపోతున్న ఈ బాధితులు, వారికి కుటుంబాలకు ఎవరు జవాబుదారీ? రానురాను సామాజిక విపత్తుగా మారుతున్న ఈ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల నియంత్రణ ఉందా లేదా... ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న కర్తవ్యం ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.