బహుళ అంతస్తుల్లో మనం ఎంతవరకు భద్రం..?
Pratidwani: ఇటీవల ఎక్కడ చూసినా... తరచు ఏదొక చోట అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం, అభంశుభం తెలియని ఎంతోమంది ప్రాణాలు కోల్పోడం, భారీగా ఆస్తినష్టం సంభవించడం మనం చూస్తునే ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి వరస విషాదాలు. మొన్నటికి మొన్న డెక్కన్‌మాల్ ఘటనను మరిచి పోక ముందే స్వప్నలోక్ కాంప్లెక్స్ ప్రమాదం సమస్య తీవ్రతను మరోసారి అందరికీ తెలియజెప్పింది. వచ్చేది వేసవి కాలం... ఈ సమయంలో మామూలుగానే అగ్ని ప్రమాదాలు ఎక్కువ. ఇక హైదరాబాద్ నగరంలో విద్యుత్ ప్రమాణాలు సరిగా పాటించని భవనాలు కోకొల్లలు. నిద్రపోతున్న గ్రేటర్ యంత్రాంగం, మాకేం సంబంధం లేనట్లుగా చెప్పే అగ్ని ప్రమాద నివారణ శాఖల సమన్వయం పుణ్యమా.. ఇటీవల ప్రమాదాలు భారీగానే చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు తూతూమంత్రంగా హడావుడి చేయడం మినహా ఈ శాఖలు నిబద్ధతగా చేస్తున్న పనంటూ ఏమీ లేదని అందరికి తెలిసిందే. అసలు ఈ ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు అవసరం..? భవన నిర్మాణాల పరంగా, అనుమతుల పరంగా, భద్రతా ఏర్పాట్ల పరంగా పాటించాల్సిన నిబంధనలేమిటి? తప్పు ఎక్కడ జరుగుతోంది? సరిదిద్దుకోవడం ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.