Farmers: 'ప్రభుత్వం ఇచ్చే రూ.10 వేలు ఏమాత్రం సరిపోవు.. పరిహారం పెంచాలి'
Farmers Suffered Due to Untimely Rains: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు కురిసిన అకాల వర్షంతో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో 31,000 ఎకరాల్లో, నిజామాబాద్ జిల్లాలో 15,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. కర్ర మీద ఉన్న ధాన్యం గింజలు నేలరాలాయి. వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. కనీసం పెట్టుబడి కూడా మిగలని దుస్థితి నెలకొందని కర్షకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఇస్తానన్న రూ.10,000 ఏమాత్రం సరిపోవని అన్నదాతలు వాపోతున్నారు. కేవలం 20 నిమిషాలు కురిసిన వడగండ్ల వర్షంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు కోసం లక్షల్లో పెట్టుబడి పెట్టామని వివరించారు. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని వారు వేడుకుంటున్నారు. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే తరలించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇస్తానన్న పరిహారాన్ని పెంచాలని అంటున్న జిల్లా రైతులతో మా ప్రతినిధి శ్రీశైలం ముఖాముఖి..