'తెలంగాణ సమాజం ప్రేమకు లొంగుతుందే తప్ప భయభ్రాంతులకు గురిచేస్తే లొంగదు' - సిద్దిపేట తాజా వార్తలు
Published : Nov 5, 2023, 8:20 PM IST
Etela Rajender Vs KCR in Gajwel : గజ్వేల్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రలోభాలకు గురిచేసి ఓటర్లను ప్రభావితం చేస్తే.. గతంలో హుజురాబాద్లో వచ్చిన తీర్పే ఇక్కడ కూడా పునరావృతమవుతుందని ఈటల స్పష్టం చేశారు. ఇవాళ గజ్వేల్ పట్టణంలో కార్యకర్తలతో సమావేశమయిన ఈటల.. దిశానిర్దేశం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యాలపై విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులకు భూములు తీసుకోవడంలో తప్పు లేదు కానీ.. ప్రాజెక్టు పరిసరాల్లో సుందరీకరణ పేరుతో పేదల భూములను తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.
తాము అధికారంలోకి రాగానే అలాంటి భూములు అన్నింటిని తిరిగి రైతులకు ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ గజ్వేల్‌లో కేసీఆర్ గెలిస్తే మన బతుకులు అధోగతి పాలవ్వడం ఖాయమన్నారు. హుజురాబాద్లో జరిగిన తీర్పుతోనైనా బీఆర్ఎస్ బుద్ధి తెచ్చుకొని ఇక్కడ మెలగాలన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తే భయపడేందుకు ఎవరు సిద్ధంగా లేరని హెచ్చరించారు. తెలంగాణ సమాజం ప్రేమకు లొంగుతుందే తప్ప భయభ్రాంతులకు గురిచేస్తే లొంగదన్నారు. గజ్వేల్‌లో ముమ్మాటికి భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్ను ఓడించేందుకు ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఈటల ఆశాభావం వ్యక్తం చేశారు.