Etela Rajender Fires on BRS Govt : 'బీజేపీ అధికారంలోకి వస్తే రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందించే దిశగా కృషి చేస్తాం' - Etela Rajender political comments
MLA Etela Rajender Fires on CM KCR : మద్యం అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని దక్కించుకుందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులతో కళకళలాడుతున్నాయని విమర్శించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు తలపెట్టిన 'ఇంటింటికి బీజేపీ' పాదయాత్ర ఇవాళ 50వ రోజుకు చేరుకోంది. ఈ పాదయాత్రలో పాల్గొన్న ఈటల.. అనంతరం ప్రసంగించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, పింఛన్లు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా వైద్యం అందించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నాణ్యమైన విద్యను అందిస్తామని స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కొరకు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.