Etela Rajendar Fires on CM KCR : కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి.. బీజేపీకి తప్ప మరొకరికి లేదు: ఈటల రాజేందర్ - Etela Rajender fires on KCR
Published : Aug 25, 2023, 3:55 PM IST
Etela Rajendar Fires on CM KCR : రాష్ట్రంలో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆ పార్టీ ఎన్నికల నిర్వహణా కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే శక్తి.. తమ పార్టీకి తప్ప మరొకరికి లేదని పేర్కొన్నారు. ఈ నెల 27న ఖమ్మంలో జరగనున్న అమిత్ షా సభా ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. తెలంగాణలో నియంత పాలన అంతం చేసేందుకే మోదీ, అమిత్ షా వస్తున్నారని ఈటల రాజేందర్ వెల్లడించారు.
తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలు ఎక్కడ చేజారిపోతారో అన్న భయంతో కేసీఆర్.. ముందస్తుగా వారికి సీట్లు కేటాయించారని ఈటల రాజేందర్ విమర్శించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నాయకులను గ్రామాలకు పంపించి.. డబ్బులతో ఇతర పార్టీల నేతలను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. సమాజంలో అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించకుండా.. రాష్ట్ర ప్రభుత్వం తన అహంకారాన్ని చాటుకుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి పాలనపై ప్రజలు విసుగు చెందారని.. మళ్లీ కేసీఆర్‌కు అధికారమిస్తే తెలంగాణ అధోగతి పాలవుతుందని ఈటల రాజేందర్ ఆక్షేపించారు.