ఆకలి తెలిసిన మేము అధికారంలోకి వస్తే బాధలన్నీ తీరుస్తాం : ఈటల రాజేందర్ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
Published : Nov 17, 2023, 9:45 PM IST
Etela Rajendar Election Campaign in Shamirpet : అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ చెంప చెళ్లుమనిపించేలా తీర్పు ఇవ్వాలని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. ఆకలి తెలిసిన తాము అధికారంలోకి వస్తే బాధలు అన్నీ తీరుస్తామని హమీనిచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్ మండల కేంద్రంలో మేడ్చల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబ్బులు ఖర్చుపెట్టి గెలుపు సాధించాలని అన్నట్లుగా రాజకీయాలు తయారయ్యాయని ఆరోపించారు. ప్రజల సమస్యలు తీర్చేవారిని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం ఈ రూట్లో వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు ఒక్కరోజైనా శామీర్‌పేట్‌లో ఆగాడా? మనల్ని కలిశాడా? సమస్యలు విన్నాడా..? అని ఈటల రాజేందర్ ప్రజలను ప్రశ్నించారు. ప్రజలను కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు.
Etela Rajendar Comments on CM KCR : కనీసం ఎమ్మెల్యేలు, మంత్రులను కూడా సీఎం కలవరని ఆరోపించారు. కొత్త సచివాలయం కట్టుకున్నా ఒక్క రోజు రాలేదని ఎద్దేవా చేశారు. ప్రజల్ని కలవని, పట్టించుకోని కేసీఆర్‌ను మళ్లీ గెలిపిద్దామా అని ప్రశ్నించారు. మల్లారెడ్డికి ఓటు వేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని విమర్శించారు. సుదర్శన్‌రెడ్డికి ఓటు వేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారని సూచించారు. సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయడం అంటే.. ధర్మానికి ఓటు వేయడం, అహంకారాన్ని అణచివేయడమని స్పష్టం చేశారు. బొమ్మరాశిపేటలో భూములన్నీ గుంజుకొని పెద్దలకు కేసీఆర్ కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గజ్వేల్‌కు వస్తున్నానని తెలవగానే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయాడని ఎద్దేవా చేశారు. గజ్వేల్‌లో గెలిచేది ధర్మమేనని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అండతో హామీ ఇస్తున్నా:
- ప్రతి పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య ఉచితంగా అందిస్తాం
- ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తాం
- నిరుద్యోగ బిడ్డలకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తాం
- ఇద్దరు ముసలోళ్లకు పెన్షన్ అందిస్తాం
- డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అర్హులందరికీ ఇస్తాం