Lock to Minister Chamber: మంత్రికి షాక్ ఇచ్చిన ఉద్యోగులు.. ఛాంబర్‌కు తాళం వేసి నిరసన - మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
Lock to Minister Chamber: ఆంధ్రప్రదేశ్‌లో గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు, ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో జాప్యం కామన్ అయిపోయింది. జీతాలు చెల్లించాలని రోడ్ల మీదకు ఎక్కి నిరసనలు తెలిపడం.. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే తాజాగా కొన్ని నెలల నుంచి వేతనాల చెల్లింపులో అలసత్వం వహిస్తున్నారని అసహనం చెందిన ఉద్యోగులు.. ఏకంగా సచివాలయంలోని మినిస్టర్ ఛాంబర్‌కే తాళం వేశారు.
ఏపీ సెక్రటేరియట్ లోని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీ మూతపడింది. మంత్రి ఛాంబర్ కు సచివాలయ సిబ్బంది తాళం వేశారు. 8 నెలలుగా జీతాలు లేవంటూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఈ పని చేశారు. గతేడాది డిసెంబర్ నెల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులకు హాజరుకావడం లేదు. ఇప్పుడు ఏకంగా మంత్రి పేషీకి తాళం కూడా వేశారు. సాధారణంగా.. మంత్రి పేషీ రోజూ తెరుచుకునేది. అధికారులు, సిబ్బంది వచ్చి తమ విధులు నిర్వర్తించే వారు. అయితే, 8 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో మనస్తాపానికి గురైన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు.. మంత్రి ఛాంబర్ కి తాళం వేశారు. జీతాల విషయం గురించి అధికార యంత్రాంగానికి, మంత్రికి ఎన్నిసార్లు చెప్పినా ఏమాత్రం స్పందించకపోవడంతో ఉద్యోగులు తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. డిసెంబర్ నుంచి జీతాలు చెల్లించకపోవడంతో తాము ఎలా బతకాలని వాపోయారు..
ఈ పరిస్థితుల్లో మరో దారి లేక విధులకు హాజరుకావడం మానేశారు. శుక్రవారం విధులకు వచ్చిన సిబ్బంది.. ఇక డ్యూటీకి వచ్చేది లేదని అధికారులకు తెలిపారు. అయినప్పటికీ అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి స్పందన లేకపోయింది. దాంతో సిబ్బంది.. మంత్రి ఛాంబర్ కి తాళం వేసి వెళ్లిపోయారు. మంత్రి పేషీకి వేసిన తాళం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. సిబ్బంది విధులకు హాజరుకాకపోవడంతో అధికారులు కూడా మంత్రి ఛాంబర్ కి రావడం లేదు. క్యాంపు కార్యాలయం వద్దే విధులు నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా సెక్రటేరియట్ లోని మంత్రి పేషీ మూతబడటం సంచలనంగా మారింది. ఛాంబర్ కి తాళం వేయడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. పరిపాలనకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఆగిపోయాయి. దాంతో అధికారులు మంత్రి క్యాంప్ ఆఫీసులో, ఎక్కడ వీలైతే అక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
సచివాలయంలో తెరుచుకోని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పేషీపై వచ్చిన కథనంపై ప్రభుత్వం అఘమేఘాలపై స్పందించింది. సిబ్బంది విధులకు కాస్త ఆలస్యంగా హాజరు అయ్యారంటూ వివరణ ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంటకు.. పేషి తాళాలు తెరిపించారు. తన పేషీలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు డిసెంబర్ నెల నుంచి చెల్లించాల్సిన జీతాలను వెంటనే చెల్లించాలని అధికారులకు మంత్రి చెల్లుబోయిన ఆదేశాలు ఇచ్చారు. సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని రెగ్యులర్‌గా జీతాలు చెల్లించాలని సూచించారు. కాపు కార్పొరేషన్ ఎండీ అర్జనరావుకు జీతాల చెల్లింపు బాధ్యతలు అప్పగిస్తూ బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాములు ఆదేశాలు ఇచ్చారు...