ఏనుగుల గుంపు హల్చల్.. పంటలను ధ్వంసం చేసి..
కర్ణాటకలోని బెళగావి జిల్లా గోదోలి గ్రామంలో అడవి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జనావాసాల్లోకి ప్రవేశించి పంటలను నాశనం చేశాయి. ఒక్కసారిగా గజరాజులు గుంపుగా వ్యవసాయ భూమిలోకి రావడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గ్రామానికి చెందిన కొందరి రైతుల పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. దీంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఏనుగులను పట్టుకొని తిరిగి అడవిలోకి వదిలిపెట్టారు. కాగా మంగళవారం కూడా కర్ణాటక సరిహద్దులోని మెట్టల్వాడి గ్రామంలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో హొన్నాలి నుంచి దారితప్పి వచ్చిన ఐదు ఏనుగులను అధికారులు అడవిలో విడిచిపెట్టారు. అంతకుముందు జనవరి 21న జరిగిన రెండు వేర్వేరు అడవి ఏనుగులు దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని అధికారులు తెలిపారు.