ఐదు రోజులుగా నదిలోనే ఏనుగు.. బయటకు వచ్చేందుకు నిరాకరణ - ఐదు రోజులుగా నీటిలోనే అడవి ఏనుగు
అసోంలో అనారోగ్యంతో బాధపడుతోన్న ఏనుగు నదిలో నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరిస్తోంది. సోనిత్పుర్ జిల్లాలోని దేకియాజులీలో గత 5 రోజులుగా నీటిలోనే ఏనుగు ఉంటోందని గ్రామస్థులు తెలిపారు. ఆహారం పెట్టేందుకు ప్రయత్నించినా.. ఏనుగు బయటకు రావడానికి విముఖత చూపుతోందని వెల్లడించారు.
ఇదీ జరిగింది
ఆదివారం 9 ఏనుగులతో కూడిన ఓ గుంపు ఆహారం కోసం వెతుక్కుంటూ తెలెరియా గ్రామంవైపు వచ్చింది. ఈ గుంపులోని 8 ఏనుగులు బ్రహ్మపుత్ర నదిని దాటగా ఓ ఏనుగు మాత్రం నీటిలో ఉండిపోయింది. దీనిని గమనించిన గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఆహారం పెట్టేందుకు ప్రయత్నించినా.. ఏనుగు బయటకు రావడానికి నిరాకరిస్తోందని గ్రామస్థులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు ఏనుగును బయటకు తీసుకువచ్చేందుకు విఫలయత్నం చేశారు. బహుశా ఏనుగు గాయపడి ఉండవచ్చని.. వన్యప్రాణుల సంరక్షణ నిపుణుడు తెలిపారు. ఆ గాయాల నుంచి ఉపశమనం పొందేందుకు సహజ జలచికిత్స తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ఏనుగును నీటి నుంచి బయటకు తీసుకురావడం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏనుగు మల విసర్జనపై పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రస్తుతానికి ఏనుగును నీటిలోనే ఉంచాలని అటవీ శాఖ నిర్ణయించింది.