మామిడికాయల కోసం వెళ్లి చెట్టు కొమ్మల్లో ఇరుక్కున్న ఏనుగు.. 18 గంటలు పాటు.. - చెట్టు కొమ్మల్లో 18 గంటలు గజరాజు నరకయాతన
ఓ గజరాజు చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కుని 18 గంటలపాటు నరకయాతన అనుభవించింది. ఆకలి తీర్చుకునేందుకు ఓ గ్రామంలోని మామిడి తోటలోకి ప్రవేశించింది. ఈ క్రమంలో చెట్టుకున్న మామిడి కాయలను తెంపే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టుకున్న రెండు కొమ్మల మధ్యలో ఇరుక్కుపోయింది. ఒడిశా అంగుల్ జిల్లాలోని బ్రూతి గ్రామంలో జరిగిందీ ఘటన.
సోమవారం రాత్రి బ్రూతి గ్రామంలోని ఓ తోటలో మామిడి కాయలను తినేందుకు వచ్చిన ఆడ ఏనుగు కాళ్లు అనుకోకుండా చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కుపోయాయి. దీంతో అది కదలలేక కింద పడిపోయి అరవటం మొదలుపెట్టింది. గజరాజు కేకలు విన్న గ్రామస్థులు తోటలో గుమిగూడారు. అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది 5 గంటల పాటు శ్రమించి జేసీబీ సహాయంతో చెట్టు కొమ్మలను విరగ్గొట్టి ఏనుగును క్షేమంగా రక్షించారు. పశువైద్యుడితో చికిత్స చేయించిన అనంతరం దాన్ని తిరిగి అడవిలోకి విడిచిపెట్టారు. ప్రాణాలు కాపాడుకున్న గజరాజు హమ్మయ్య అంటూ అడవిలోకి పరుగు తీసింది.