తప్పిపోయిన పిల్ల ఏనుగు- డ్రోన్లు, అటవీ సిబ్బంది సాయంతో సేఫ్‌గా తల్లి వద్దకు! - తల్లిచెంతకు ఏనుగు
Published : Jan 1, 2024, 10:11 PM IST
Elephant Reunited With Mother :ఏ జీవికైనా తన తల్లిపై మమకారం ఎంతో ఉంటుంది. ఒకవేళ తల్లి, బిడ్డలు వేరైతే ఆ రెండు ప్రాణాల వ్యథ వర్ణణాతీతం. ఇలాగే తప్పిపోయిన ఓ ఏనుగు పిల్ల తన తల్లి కోసం అడవి అంతా తిరిగింది. ఆకలితో అలమటిస్తూ కంగారుగా అటు ఇటు వెతికింది. దీన్ని గమనించిన అటవీ శాఖ అధికారులు పిల్ల ఏనుగును చూసి చలించిపోయారు. ఎలాగైనా ఆ గున్న ఏనుగును తన తల్లి దగ్గరకు చేర్చాలనుకున్నారు. దాని కోసం ఎంతో శ్రమించి ఎట్టకేలకు గున్న ఏనుగును తల్లి వద్దకు చేర్చారు.
తమిళనాడు పొల్లాచ్చికి సమీపంలోని అన్నామలై టైగర్ రిజర్వ్‌లో ఓ ఏనుగు పిల్ల తప్పిపోయింది. ఎటు పోవాలో తెలియక, అటు ఇటు తిరుగుతూ తల్లిని వెతికింది. అదే సమయంలో అడవి జంతువులను ట్రాక్ చేస్తున్న అటవీ అధికారులు, పిల్ల ఏనుగును గుర్తించారు. తల్లి కోసం అలమటిస్తున్న గున్న ఏనుగును చూసి చలించిపోయారు. ఎలాగైనా తనను తల్లి దగ్గరకు చేర్చాలనుకున్నారు. ఫలితంగా ఎంతో శ్రమించి తల్లి గూటికి చేర్చారు.
అన్నామలై టైగర్ రిజర్వ్‌లో ఏనుగు పిల్లను తల్లి గూటికి చేర్చటానికి అటవీ అధికారులు ఎంతో శ్రమించారు. పిల్ల ఏనుగును ఒక ట్రక్కులోకి ఎక్కించారు. వాగులు, వంకలు దాటిస్తూ కొండలు ఎక్కారు. అయినా ఎక్కడా తల్లి ఏనుగు జాడ దొరకలేదు. చివరికి డ్రోన్లు, అనుభవజ్ఞుల అటవీ వాచర్ల సాయంతో అధికారులు తల్లి ఏనుగు గుంపును గుర్తించారు. ఫలితంగా సహాయక బృందం ఎంతో సురక్షితంగా గున్న ఏనుగును తల్లి వద్దకు చేర్చారు.