క్రికెట్, పుట్బాల్ ఆడుతున్న ఏనుగు.. స్నానం కూడా సొంతంగానే - క్రికెట్ ఆడుతున్న ఏనుగు
కర్ణాటక.. మంగళూరు జిల్లాలోని కటీలు శ్రీ దుర్గపరమేశ్వరి ఆలయంలో ఉన్న ఓ ఏనుగు.. పుట్బాల్, క్రికెట్ ఆడుతోంది. స్వతహాగా స్నానం కూడా చేస్తోంది. 36 ఏళ్ల వయసులో చలాకీగా ఆటలు ఆడుతోంది. 1994లో కటీలు ఆలయానికి ఈ ఏనుగును తీసుకువచ్చారు సిబ్బంది. ముద్దుగా మహాలక్ష్మి అని పేరు కూడా పెట్టారు. గత ఎనిమిది నెలల నుంచి మహాలక్ష్మి.. ఈ ఆటలు ఆడుతోందని సిబ్బంది చెబుతున్నారు. ఫైరోజ్, అల్తాప్, ముజాహిద్ అనే ముగ్గురు యువకులు.. ఈ ఏనుగును సంరక్షిస్తూ, ఆటలు నేర్పిస్తున్నారు. రోజూ ఈ ఏనుగు రెండు గంటలకు పైగా పుట్బాల్, క్రికెట్ ఆడుతుంది. పైపుతో తనంతట తానే స్నానం చేస్తుంది. రోజూ దేవుడి విగ్రహం ముందుకు వచ్చి గంట కొట్టి ప్రార్థన చేస్తుంది. ఉదయం ఏడు గంటలకు ఏనుగు స్నానం చేస్తుంది. 10.30 గంటలకు గడ్డి, అన్నం, బెల్లం, అరటి పండ్లు, దోసకాయలు తింటుంది. మధ్నాహ్నం 1.30 గంటలకు జొన్న బాల్స్, 2.45కు ఆకుకూరలు ఆరగిస్తుంది. మధ్యాహ్నం 3.30 నుంచి 6.30 వరకు విశ్రాంతి తీసుకుంటుంది. రాత్రి గడ్డి, అరటి పండ్లు వంటివి భుజిస్తుంది. రోజుకు దాదాపు 250 కిలోల ఆహారాన్ని ఈ ఏనుగు లాగించేస్తుంది. ఆరు నెలలకొకసారి వైద్యులు దీనికి పరీక్షలు నిర్వహిస్తారు.