Elephant Viral Video: చేతిపంపు కొట్టి నీరు తాగిన ఏనుగు.. నెటిజన్లు ఫిదా - elephant viral videos
Elephant Drinking Water from a Hand Pump: ఏనుగుకు దాహం వేసింది. అడవుల్లోనైతే ఏ చెరువులోనో, కుంటలోనో నీరు తాగేది. జనావాసాల్లో తిరుగుతున్న దానికి అవేవీ కనిపించలేదు. ఉన్నదల్లా ఓ చేతి పంపు. దాన్నుంచే స్థానికులు రోజూ నీటిని తీసుకెళ్తుంటారు. ఈ విషయాన్ని ఆ ఏనుగు ఎప్పుడు గమనించిందోగానీ.. తన దాహం తీర్చుకునేందుకు చేతిపంపునే ఆశ్రయించింది. తొండంతో చేతిపంపును కొట్టి.. నీరు రాగానే తాగేసింది. ఇది చూసిన స్థానికులు ముక్కున వేలేసుకున్నారు. ఈ ఆశ్చర్యకర సంఘటన పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలోని వన్నాం గ్రామంలో చోటుచేసుకుంది. ఏనుగు దాహం తీర్చుకున్న విధానాన్ని స్థానికులు వీడియో తీసి.. దానిని సామాజిక మాధ్యమంలో పెట్టారు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అవుతోంది. 8 ఏనుగులున్న మంద నాలుగేళ్ల కిందట జనావాసాల్లోకి వచ్చింది. అప్పటి నుంచి కొమరాడ మండలంలో తిరుగుతోంది. ఆ మందలోని హరి అనే ఏనుగే ఈ విధంగా చేతిపంపు కొట్టి నీరు తాగింది. దీంతో ఈ ఏనుగు తెలివికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.