Electric Scooter Fire Accident : ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాస్ట్.. బ్యాటరీ మార్చిన మూడోరోజునే బూడిదైన ఈవీ
Electric Scooter Fire Accident :బిహార్‌లో ఎలక్ట్రిక్ స్కూటీ బ్యాటరీ పేలింది. అయితే బ్యాటరీ మార్చిన మూడోరోజే ఈ ఘటన జరగడం గమనార్హం. కాగా ఏడాది క్రితమే కొనుగోలు చేసిన స్కూటీలో.. ఇప్పటికే పలుమార్లు బ్యాటరీ ఫెయిలైందని యజమాని వాపోయారు.
బిహార్ వైశాలీ జిల్లాకు చెందిన న్యాయవాది అభినయ్ కౌశల్ ఏడాది క్రితం రూ. 85 వేలు వెచ్చించి ఈవీ స్కూటీని కొనుగోలు చేశారు. గత కొద్ది రోజుల్లో స్కూటీ బ్యాటరీ పలుమార్లు ఫెయిలైంది. ఈ విషయంపై అభినయ్ షోరూమ్‌లో ఫిర్యాదు చేశారు. అతడి ఫిర్యాదు మేరకు కంపెనీ.. పలుమార్లు బ్యాటరీనీ రీప్లేస్ చేసింది. ఈ క్రమంలో ఇటీవలె మరోసారి బ్యాటరీ మొరాయించగా.. 3 రోజుల క్రితమే కంపెనీ మరోసారి బ్యాటరీని మార్చి ఇచ్చింది.
కాగా అభినయ్ మంగళవారం సాయంత్రం తన ఇంటి వద్ద స్కూటీని పార్క్ చేశారు. అయితే బ్యాటరీ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. తర్వాత కొద్దిక్షణాల్లోనే పెద్ద శబ్దంతో బ్యాటరీ పేలింది. దీంతో స్కూటీలో మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
"కోర్టు నుంచి వచ్చాక.. స్కూటీని ఇంటి వద్ద పార్క్ చేశా. సాయంత్రం 6.30 గంటల సమయంలో బండిలో నుంచి పొగలు వచ్చాయి. తర్వాత బ్యాటరీ పేలి మంటలు అంటుకున్నాయి. ఏడాది క్రితమే బండి కొన్నా" అని అన్నారు అభినవ్.