Car Accident In Filmnagar Hyderabad : ఈ నగరానికి ఏమైంది.. వరుస కారు ప్రమాదాలు.. అన్ని ర్యాష్ డ్రైవింగ్‌లే - Telangana latest news
Electric Benz car accident in Filmnagar : రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న వరుస కారు ప్రమాదాలు తీవ్రంగా కలచి వేస్తున్నాయి. ఈనెల మొదటి వారంలో మితి మీరిన వేగంతో మైనర్ కారు నడిపి తల్లీకుమార్తెల చావుకు కారణమైన ఘటన మరువక మునుపే హైదరాబాద్‌లో నిన్న ట్యాంక్‌బండ్‌పై ఎంత ప్రమాదం తప్పిందో చూశాం. అలాగే ఇవాళ వరంగల్‌లో ఓ కారు ప్రమాదం అక్కడి స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. అలాగే ఇవాళ మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో పోలీస్‌స్టేషన్ పరిధిలో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఓ మహిళ ఓవర్ స్పీడ్‌తో డ్రైవింగ్ చేస్తూ.. చెట్టును, ఎలక్ట్రికల్ పోల్‌ను ఢీకొట్టి అనంతరం ఓ ఇంటి గోడను బలంగా ఢీ కొట్టింది. ఈ సమయంలో ఎవరు లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. కారులోని ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో డ్రైవింగ్ చేస్తోన్న మహిళ ప్రాణాలతో బయటపడింది. ప్రమాద దాటికి కారు రెండు టైర్లు విడిపోయి.. దూరంగా పడ్డాయి. ఘటనాస్థలానికి దగ్గర్లో ఓ వాచ్‌మెన్ ఫ్యామిలీ నివసిస్తోంది. కారు వారి గుడిసె దగ్గర్లోకి వచ్చి ఆగడంతో ఆ కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. ఇంత జరిగిన ప్రమాదానికి కారణమైన సదరు మహిళ ఘటన జరిగిన వెంటనే తన హైహీల్స్ భుజాన వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయిందని స్థానికులు వాపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో ఉన్నారు.